: పాకిస్థాన్ తాను చేసిన తప్పులకు తానే బలవుతోంది: భారత్
దాయాది దేశం పాకిస్థాన్ తాను చేసిన తప్పులకు తానే బలవుతోందని భారత్ వ్యాఖ్యానించింది. భారత్ లో అలజడి సృష్టించడానికి టెర్రరిస్టు గ్రూపులను పెంచి పోషించిన పాకిస్థాన్... ఇప్పుడు అదే టెర్రరిస్టుల దాడితో వణికిపోతోందని చెప్పింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో భారతదేశ శాశ్వత ప్రతినిధి అజిత్ కుమార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులంతా పాక్ లోనే పుట్టి పెరిగారని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఇచ్చిన ఆదేశాలను సైతం పాక్ బేఖాతరు చేసిందని... పీఓకేను ఆ దేశం ఖాళీ చేయడం లేదని ఆయన గుర్తు చేశారు.
పాకిస్థాన్ లోని సింధ్, ఖైబర్ ఫక్తూంక్వా, బలూచిస్థాన్ లతో పాటు మరికొన్ని గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు ఉగ్రవాద పీడితులుగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని అజిత్ కుమార్ తెలిపారు. జమ్ముకశ్మీర్ లో నెలకొన్న క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి పాకిస్థానే కారణమని ఆరోపించారు. భారత భద్రతాదళాల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల నుంచి పాకిస్థాన్ కరెన్సీ, పాకిస్థాన్ మిలిటరీ సామాగ్రి తదితర వస్తువులు భారత్ కు ఎన్నోసార్లు దొరికాయని చెప్పారు. ఇప్పుడు అదే ఉగ్రవాదానికి పాక్ బలవుతోందని అన్నారు.