: సరికొత్త ప్రేమకథ... 82 ఏళ్ల వృద్ధురాలిని వరించి ప్రేమ గుడ్డిదేనని నిరూపించిన 28 ఏళ్ల యువకుడు!


ప్రేమ గుడ్డిదని మరోసారి నిరూపించిందీ వింతైన యథార్థ ప్రేమకథ. ఓ అపరిచిత కాల్ ద్వారా పరిచయమైన మహిళ వయసు తెలుసుకోకుండానే వలచిన ఓ యువకుడు, ఆపై ఆమె 82 ఏళ్ల వృద్ధురాలని తెలుసుకుని కూడా, తన ప్రేమను చంపుకోలేక ఆమెనే పెళ్లాడాడు. ఈ ఘటన ఇండొనేషియాలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మాంటెహేగ్ కు చెందిన సోఫియన్ లోహా డాండెల్ (28) అనే యువకుడికి ఓ రోజు మార్తా పొటూ అనే మహిళ నుంచి కాల్ వచ్చింది. ఆపై తాను పొరపాటున కాల్ చేసినట్టు చెప్పింది.

అయితే, ఆ కాల్ వారిద్దరి మధ్యా పరిచయాన్ని పెంచగా, ఇద్దరూ తరచూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆమె వయసు గురించి ఆరా తీయకుండానే సోఫియన్ ఆమెను ప్రేమించాడు. ఒకరోజు ఆమెను కలవాలని వెళ్లాడు. తొలుత షాక్ తిన్నా, తనది నిజమైన ప్రేమని, ఆమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వీరి ప్రేమ గురించి తెలుసుకున్న డాండెల్ తల్లిదండ్రులు తొలుత విస్తుపోయినా, ఆపై పెళ్లికి అంగీకరించారు. దీంతో 18వ తేదీన వారి వివాహం జరుగగా, ఈ జంట ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అన్నట్టు, పదేళ్ల క్రితమే భర్తను కోల్పోయిన మార్తా పిల్లలు జర్మనీ, సౌదీ అరేబియాల్లో స్థిరపడ్డారట.

  • Loading...

More Telugu News