: మోదీతో పళని, ప్రణబ్ తో పన్నీర్... హస్తినలో జోరుగా తంబీల రాజకీయాలు
తమిళ రాజకీయాలు హస్తిన బాట పట్టాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం, మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని పెద్దలను కలిసి తమతమ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పళనిస్వామి తన వర్గం పార్లమెంట్ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ సహా, పలువురు కేంద్ర మంత్రుల బృందాలను కలవనుండగా, పన్నీస్ సెల్వం తన వర్గం ఎంపీలతో రాష్ట్రపతి ముందు తమ గోడును వెళ్లబోసుకోనున్నారు.
తమిళనాడులో నెలకొన్న పరిస్థితులు, పాలన సాగుతున్న విధానాల గురించి పళనిస్వామి ప్రధానికి వివరించనున్నట్టు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆర్థిక మంత్రితో ఆయన చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఆయన బలపరీక్ష చెల్లదని పన్నీర్ సెల్వం రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే విపక్ష నేత స్టాలిన్, ఇదే విషయాన్ని ప్రణబ్ దృష్టికి తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు హస్తిన వేదికగా సాగుతున్న తమిళనాడు రాజకీయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.