: లోకేశ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే దొడ్డిదారిన శాసనమండలికి వెళ్లద్దు: అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ యువనేత లోకేశ్‌లకు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయం పట్టుకుందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. నిన్న జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా టీడీపీ యువనేత నారా లోకేశ్‌ను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్న అంశంపై అంబటి రాంబాబు ఈ రోజు స్పందించారు. గుంటూరులో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... లోకేశ్ కు దమ్ము, ధైర్యం ఉంటే దొడ్డిదారిన శాసనమండలికి వెళ్లద్దని అన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి సత్తా నిరూపించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
అమరావతిలో నిర్మించిన నూతన అసెంబ్లీ నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆ భవన నిర్మాణ వ్యయం రూ. 200 కోట్ల నుంచి రూ. 750 కోట్లకు ఎలా చేరిందో చెప్పాలని ఆయన అన్నారు. అలాగే, రాజధాని పేరుతో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. అందుకే కొత్త అసెంబ్లీ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ రావడం లేదని అన్నారు.