: గొర్రె పొట్టేళ్ల మందలోకి పెద్దపులిని తోలినట్టవుతుంది!: కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఆర్.కృష్ణయ్య ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు రిజర్వేషన్‌ల అంశంలో జరుగుతున్న పోరాటం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశంపై మంజునాథ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఈ రోజు మంజునాథ కమిషన్ విజయవాడలో అభిప్రాయసేకరణ చేపట్టింది. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై తమ అభిప్రాయాన్ని చెప్పడానికి వచ్చిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపులను బీసీల్లో చేరిస్తే యుద్ధమే జరుగుతుందని మీడియాతో అన్నారు. వారిని బీసీల్లో చేర్చడమనేది సరైనది కాదని వ్యాఖ్యానించారు. బీసీలో ఇప్పుడున్న కులాలన్నింటినీ ఓ శాస్త్రీయ పద్ధతిలో చేర్చారని ఆయన అన్నారు. అలా శాస్త్రీయ పద్ధతి లేకుండా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఓ కులాన్ని బీసీలో చేరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆ పనే చేస్తే గొర్రె పొట్టేళ్ల మందలోకి పెద్దపులిని తోలినట్టవుతుందని ఆయన అన్నారు.