: ట్రంప్ తీరుతో భయం, భయం.. యూఎస్‌లో బిక్కుబిక్కుమంటున్న 6 లక్షలమంది తెలుగువారు


అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆరు లక్షల మంది తెలుగువారు ఇప్పుడు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిలో భయం మరింత ఎక్కువైంది. తాజాగా జరిగిన కాన్సస్ ఘటన వారిని మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ప్రవాసాంధ్రుల మీద జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం, ఈ ఘటనను ఖండిస్తున్నట్టు ట్రంప్ నోటి నుంచి ఒక్కమాట కూడా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారిలో విద్యార్థులు, ఐటీ నిపుణులు, వైద్యులే అధికం. గతేడాది 60 వేల మంది భారతీయ విద్యార్థులు విద్యార్థి వీసాలపై అమెరికాలో అడుగుపెట్టగా వీరిలో హైదరాబాద్ నుంచి వెళ్లినవారి సంఖ్యే అధికం.

తాజాగా శ్రీనివాస్ కూచిభొట్ల హత్య జరిగిన కాన్సస్‌లో 30 వేలమంది వరకు ప్రవాస భారతీయులు నివసిస్తున్నట్టు అంచనా. మిగతా నగరాల్లాగే కాన్సస్ కూడా చాలామంచి నగరమేనని 15 ఏళ్లుగా అక్కడే ఉంటున్న ప్రవాస భారతీయుల సంఘం మాజీ అధ్యక్షుడు విజయ్ అయినాపురపు తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన కాన్సస్ ఘటన తర్వాత ప్రవాసాంధ్రులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అమెరికా పౌరుల్లో చాలామందికి ఎవరు భారతీయుడో, ఎవరు పాకిస్థాన్‌కు చెందిన వారో తెలియదని అక్షయ్ ఆనంద్(34) పేర్కొన్నారు. తాజా కాల్పులు జరిపిన వ్యక్తి మధ్యప్రాచ్య దేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను కాల్చానని కేకలు వేశాడని, దీనిని బట్టి అతడు ఏ దేశ పౌరుల్ని కాలుస్తున్నాడనే విషయం అతడికే తెలియదని అక్షయ్ తెలిపారు.

  • Loading...

More Telugu News