: అమెరికాలోని అధికారులతో మాట్లాడాం.. అగ్రరాజ్యంలో జాతివివక్ష తగదు: వెంకయ్య నాయుడు
అమెరికాలో జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన తెలుగు ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, రాష్ట్ర బీజేపీ నేత కిషన్ రెడ్డి ఈ రోజు పరామర్శించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ఇటువంటి స్థానిక, స్థానికేతర భావాలను రెచ్చగొట్టడం సమాజానికి మంచిది కాదని అన్నారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కూచిభొట్ల శ్రీనివాస్ భార్య మీడియాతో ఆవేదనతో మాట్లాడిందని, గట్టిగా ప్రశ్నించిందని అన్నారు. అమెరికాలో మన దేశస్థులు ఎంతో మంది ఉన్నారని, తెలుగువారు కూడా ఎంతో మంది ఉన్నారని వెంకయ్య అన్నారు.
శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడం అందరినీ బాధపెడుతోందని వెంకయ్య నాయుడు చెప్పారు. శ్రీనివాస్ మృతి పట్ల అక్కడి రాయబార కార్యాలయంతో మాట్లాడామని చెప్పారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో జాతివివక్ష తగదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాము విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.