: మేము సన్నాసులమా? కేసీఆర్ హోదాకు తగ్గట్లు మాట్లాడాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మహబూబాబాద్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నేతలను సన్నాసులు అనడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన హోదాకు తగ్గట్లు మాట్లాడటం లేదని ఆయన అన్నారు. రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయలేదని ఆరోపించారు. ఆంధ్రా నాయకులకు సూట్‌కేసులు మోసిన చరిత్ర తమకు లేదని ఆయన అన్నారు.
ఆంధ్రా గుత్తేదార్ల కోసం ప్రాజెక్టుల డిజైన్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రా గుత్తేదార్లకు కేసీఆర్ ప్రభుత్వం రూ.30వేల కోట్ల టెండర్లను కట్టబెట్టిందని చెప్పారు. ఈ విషయంపై అవసరమైతే తాము చర్చకు సిద్ధమని అన్నారు. లౌకికవాద దేశంలో రూ.కోట్ల ప్రజాధనాన్ని దేవుడి మొక్కుల పేరుతో ఎలా ఖర్చుచేస్తారని ఆయన నిలదీశారు. అంతేగాక, రూ.కోట్ల ప్రజాధనంతో చార్టెడ్ విమానాల్లో విలాసాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ సర్కారు రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తోందని చెప్పారు.