: బీజేపీ నేత కిషన్ రెడ్డి వాహనం బోల్తా... డ్రైవర్, పీఏకు గాయాలు
తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి వాహనం అదుపు తప్పి బోల్తాపడిందన్న వార్త పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. అయితే ఆ వాహనంలో కిషన్ రెడ్డి లేరన్న సమాచారం అందర్నీ ఆనందంలో ముంచెత్తింది. కరీంనగర్ జిల్లా బొగ్గుబావుల పర్యటనకు కిషన్ రెడ్డి వెళ్లారు. ఈ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి హైదరాబాద్ కు పయనమయ్యారు.
ఈ క్రమంలో ఒక వాహనంలో కిషన్ రెడ్డి, ఆయన అనుచరులు... మరో వాహనంలో ఆయన డ్రైవర్, పీఏ, మరో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఆ వాహనం డ్రైవర్ రాజబొల్లారం తండా వద్ద లారీని తప్పించబోయి ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి, బోల్తా పడింది. దీంతో ఈ కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. కిషన్ రెడ్డి మరికొందరు అనుచరులు వారిని ఆసుపత్రికి తరలించారు.