: ఈ రోజు కీలక ప్రకటన చేయనున్న జయ మేనకోడలు దీప!
తన మేనత్త దివంగత జయలలిత జయంతి రోజునే తన పొలిటికల్ ఎంట్రీని ప్రకటించబోతున్నారు ఆమె మేనకోడలు దీప. తాను స్థాపించబోయే కొత్త పార్టీపై ఈ సాయంత్రం అధికారికంగా ప్రకటన చేస్తానని ఆమె తెలిపారు. అన్ని విషయాలపై సాయంత్రం మాట్లాడతానని అన్నారు. తన సోదరుడు దీపక్ ఇన్నాళ్లు మౌనంగా ఉండి, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుండటం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని చెప్పారు.
దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తాను శశికళ నాయకత్వాన్ని మాత్రమే సమర్థిస్తానని, ఆమె కుటుంబ సభ్యుల నాయకత్వాన్ని సమర్థించనని దీపక్ తెలిపారు. అంతేకాదు, జయ ఆస్తులన్నీ తనకు, దీపకు మాత్రమే చెందుతాయని ఆయన చెప్పారు. కాగా, ఈ రోజు జయలలిత జయంతి సందర్భంగా ఆమె సమాధి వద్దకు వెళ్లిన దీప... జయకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఆమె పైవ్యాఖ్యలు చేశారు.