: స్వరం మార్చిన జయ మేనల్లుడు... శశికళ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న దీపక్!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనల్లుడు దీపక్ మాట మార్చాడు. జయలలిత మరణించిన అనంతరం ఆమె అంత్యక్రియల్లో కనిపించిన దీపక్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆ తరువాత ఎలాంటి సందడి లేని దీపక్... పన్నీరు సెల్వం శశికళపై తిరుగుబావుటా ఎగురవేసిన అనంతరం మరోసారి తెరపైకి వచ్చాడు. ఈ సందర్భంగా శశికళ ఆంటీపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, తమ అత్తను అంటిపెట్టుకుని ఉన్నది ఆమేనని తేల్చిచెప్పాడు. తన సోదరి దీప తనలా అత్తకు దగ్గర కాలేకపోయిందని కూడా చెప్పాడు. ఆ తరువాత ఇన్నాళ్టికి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. దినకరన్ కు పార్టీని అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నానని తెలిపాడు.
తన అత్త వెళ్లగొట్టిన దినకరన్ కు పార్టీ పగ్గాలు అప్పగించడంపై మండిపడ్డాడు. శశికళపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని తేల్చిచెప్పాడు. అలాగని ఆమె తమ అత్తకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే మౌనంగా ఊరుకోనని తెలిపాడు. పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం తనకు, తన సోదరి దీపకు చెందుతుందని తెలిపాడు. అందులో శశికళకు ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేశాడు. శశికళ నాయకత్వాన్ని అంగీకరించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. అలాగని శశికళ కుటుంబం నాయకత్వం వహిస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పాడు. తన అత్త మరణంపై విచారణ జరగాలని దీపక్ డిమాండ్ చేశాడు.