: జ‌యలలిత ఫొటోలు విడుద‌ల చేయ‌లేకపోవడానికి కారణాలు తెలిపిన అపోలో ఆసుపత్రి!


అనారోగ్య సమస్యలతో చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చేరి 75 రోజుల పాటు చికిత్స పొంది, చివరికి మరణించిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు విడుద‌ల చేయ‌క‌పోవ‌డం గురించి మద్రాసు హైకోర్టులో స‌ద‌రు ఆసుప‌త్రి వివ‌ర‌ణ ఇచ్చుకుంది. జ‌య‌ల‌లి‌త మృతిపై పలు సందేహాలున్నాయంటూ న్యాయ‌స్థానంలో జోసెఫ్ అనే వ్యక్తి పిటిషన్ వేసిన‌ నేప‌థ్యంలో హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అపోలో ఆసుపత్రికి నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసు ఈ రోజు మ‌రోసారి విచార‌ణ‌కు వ‌చ్చింది.

ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి, చికిత్స పొందుతోన్న వ్యక్తికి సంబంధించిన గోప్యతపై మెడికల్ కౌన్సిల్ ఆప్ ఇండియా కొన్ని నిబంధ‌న‌లు విధించిందని తెలిపింది. తాము ఆ నిబంధ‌న‌ల‌ను అనుసరించే జయలలితకు అందించిన చికిత్స వివరాలు బయటకు తెలపలేదని అపోలో ఆసుపత్రి చెప్పింది. చివ‌రికి జ‌య‌ల‌లిత‌ ఆరోగ్యానికి సంబంధించిన పత్రికా ప్రకటనలను కూడా ఆమె అనుమతితోనే విడుదల చేసినట్లు పేర్కొంది. తన ఫొటోలను విడుదల చెయ్యరాదంటూ జయలలిత త‌మ‌ను స్వయంగా కోరార‌ని, అందువ‌ల్లే వాటిని విడుద‌ల చేయ‌లేద‌ని పేర్కొంది.

మ‌రోవైపు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చుకుంటూ, జయలలితకు అపోలో ఆసుపత్రిలో సరైన చికిత్స అందించినట్లు చెప్పింది. అయితే, దీనికి పిటిష‌న‌ర్ అభ్యంత‌రం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్, అపోలో అఫిడవిట్ ఒకేలా ఉన్నాయని అనుమానం వ్య‌క్తం చేశారు. కాగా, కేంద్ర ప్ర‌భుత్వ న్యాయ‌వాది మాత్రం జ‌య‌ల‌లిత మృతిపై ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. త‌మ‌కు మరో రెండు వారాల స‌మ‌యం కావాల‌ని కోరారు. దీంతో ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను హైకోర్టు వచ్చేనెల 13 వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News