: భారత బౌలర్ల ఆధిక్యాన్ని అడ్డుకున్న స్టార్క్... 256/9 వద్ద ముగిసిన ఆసీస్ తొలిరోజు ఆట


తొలిరోజు భారత బౌలర్ల ఆధిక్యాన్ని మిచెల్ స్టార్క్ అడ్డుకున్నాడు. పూణే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టును టీమిండియా బౌలర్లు కుప్పకూల్చారు. వరుసగా వికెట్లు తీస్తూ టీమిండియా ఆటగాళ్లు ఆసీస్ ఇన్నింగ్స్ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో ఓపెనర్ రెన్ షా (64) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. డేవిడ్ వార్నర్ (38) వికెట్ తీయడం ద్వారా ఆసీస్ పతనాన్ని ఉమేష్ యాదవ్ ప్రారంభించాడు. వార్నర్ వికెట్ తీయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో ఒక బ్యాట్స్ మన్ వికెట్ ఐదు సార్లు తీసిన తొలి భారతీయ బౌలర్ గా రికార్డు నెలకొల్పగా, రెండో అంతర్జాతీయ ఆటగాడిగా ఉమేష్ నిలిచాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ (27), షాన్ మార్ష్ (16), హ్యాండ్స్ కొంబ్ (22) తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మిచెల్ మార్ష్ (4), మాధ్యూ వేడ్ (8) అవుటవ్వడంతో క్రీజులోకి మిచెల్ స్టార్క్ వచ్చాడు. అప్పటి వరకు భారత బౌలర్ల ఆధిపత్యం నడించింది. ఆ వెంటనే ఒకీఫ్ (0), లియాన్ (0) ను ఉమేష్ అవుట్ చేసి పెవిలియన్ కు పంపాడు. చివరి వికెట్ గా హేజిల్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. అతని అండతో స్టార్క్ (14) రెచ్చిపోయాడు.

టాపార్డర్ కు సాధ్యం కాని ఆటతీరును ప్రదర్శించాడు. ఈ క్రమంలో భారీ సిక్సర్లు బాదుతూ అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు స్కోరు బోర్డును ఊహించని విధంగా పరుగులెత్తించాడు. అంతవరకు రాణించిన భారత బౌలర్లు మరోసారి ఎప్పట్లా టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చి టెయిలెండర్ ను అవుట్ చేయడంలో బలహీనతను చాటుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్లు కోల్పోయి 256 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4 వికెట్లతో రాణించగా, అతనికి అశ్విన్, జడేజా చెరి రెండు వికెట్లతోను, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీసి సహకరించారు. 

  • Loading...

More Telugu News