: ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న వివాహేతర సంబంధం!
వివాహేతర సంబంధం ఇద్దరు ఎయిర్ పోర్స్ ఉద్యోగుల జీవితాలను నాశనం చేసిన ఘటన భటిండాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... పంజాబ్, భటిండాలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో విపిన్ శుక్లా, సులేష్ కుమార్ పని చేస్తున్నారు. విపిన్ శుక్లా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల భార్యల సంక్షేమ సంఘం కార్పొరల్ గా కూడా ఉన్నాడు. వీరిద్దరికీ వివాహమైంది. అయితే విపిన్ శుక్లాకు సార్జంట్ సులేష్ కుమార్ భార్య అనురాధతో ఉన్న పరిచయం వివాహేతర సంబంధంగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చింది. ఇది భర్తకు తెలియడంతో అతని వద్దకే వెళ్లిపోవాలని ఆయన సూచించాడు. దీంతో తనను వివాహం చేసుకోవాలంటూ విపిన్ శుక్లాను అనురాధ ఒత్తిడి చేసింది.
తనకు ఇంతకు ముందే వివాహమైందని, వివాహం చేసుకోవడం కుదరదని విపిన్ ఆమెతో కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. దీంతో జరిగిన తప్పును అంగీకరించి, పరువు పోకుండా ఉండేందుకు ఏం చేయాలని భర్తను కోరింది. దీంతో తనను మోసం చేసిన వాడిని చంపేద్దామని అతను ఆమెకు సూచించాడు. ఆమె కూడా అందుకు అంగీకరించింది. దీంతో ప్లాన్ ప్రకారం ఇల్లు మారాలని, సామాన్లు తరలించేందుకు సహకరించాలని ఫిబ్రవరి 8న విపిన్ ను సులేష్ కోరాడు. దీంతో తన పంటపండిందని, ప్రియురాలిని చూడవచ్చని భావించిన విపిన్, వాళ్లింట్లో వాలిపోయాడు. దీంతో అతనిని తన బావ సహకారంతో సులేష్ కుమార్ హత్య చేశాడు.
అనంతరం ఒక కార్టన్ బాక్స్ లో పెట్టి, అతని మృతదేహాన్ని వేరే క్వార్టర్ కి తరలించి, ఫిబ్రవరి 19న అతని మృతదేహాన్ని 12 ముక్కలు చేశాడు. ఆ ముక్కలన్నింటినీ ఫ్రిజ్ లో పెట్టి భద్రపరిచాడు. రోజూ భర్తతో ఫోన్ లో మాట్లాడే విపిన్ శుక్లా భార్య తన భర్త నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఫిబ్రవరి 9న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారించిన పోలీసులు, విపిన్ శుక్లా ఇంటి నుంచి డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు నిర్వహించగా, అవి నేరుగా సులేష్ కుమార్ ఇంటి వద్దకు వచ్చి ఆగాయి. అనంతరం అక్కడి నుంచి విపిన్ శవాన్ని భద్రపరిచిన క్వార్టర్ కు వెళ్లాయి. అక్కడ ఫ్రిజ్ తెరిచిన పోలీసులు షాక్ తిన్నారు. దీంతో సులేష్ కుమార్, అనురాధలను అదుపులోకి తీసుకున్నారు.