: పెళ్లిలో తుపాకి సందడికి వీడియో ఆధారాలు ఇవ్వండి.. రూ.పది వేలు పట్టుకెళ్లండి.. గ్వాలియర్ అధికారుల ప్రకటన
పెళ్లి వేడుకల సందర్భంగా తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపే ఘటనలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఎక్కడో ఓ చోట ఇటువంటి ఘటనలు ఆలస్యంగానైనా బయటపడుతున్నాయి. ఇక గ్వాలియర్ ప్రాంతంలోనైతే గాల్లోకి కాల్పులు జరపడం పరిపాటిగా మారింది. అయితే, తుపాకులు పేల్చిన వారు మాత్రం ఏవో కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగా పేల్చలేదని, అనుకోకుండా పేలిపోయాయని అంటున్నారు. దీంతో ఆ కాల్పులకు సంబంధించిన ఆధారాలను సంపాదించడానికి అక్కడి జిల్లా యంత్రాంగం ఒక వినూత్న ఆలోచన చేసింది. ఎవరైనా తుపాకిని పేలుస్తున్నప్పుడు వీడియో రికార్డింగ్ చేసి తమకు ఆధారాలు సమర్పించే వ్యక్తులకు రూ.10 వేలను రివార్డుగా ఇస్తామని ప్రకటన చేసింది.