: ఆ యువకుడు నిన్నటి వరకు నిరుపేద.. రేపటి నుంచి కోటీశ్వరుడు!
అతడు చిన్నప్పుడే తన చదువుకి గుడ్ బై చెప్పాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ లాటరీ టికెట్ కొన్నాడు. తాజాగా తనకు లాటరీ తగిలిందని, ఏకంగా కోటిన్నర రూపాయలు గెలుచుకున్నానని తెలుసుకొని సంబరాలు చేసుకుంటున్నాడు. నిన్నటి వరకు నిరుపేదగా బతికిన అతడు ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు. పంజాబ్ ప్రభుత్వం నిర్వహించే న్యూ ఇయర్ బంపర్ లాటరీని ఆజాద్ సింగ్ అనే 24 ఏళ్ల యువకుడు 2016 డిసెంబర్ నెలలో సిర్సాలో కొన్నాడు. హరియాణాలోని ఫతేబాద్ జిల్లా దయ్యార్ గ్రామంలో ఉండే ఆ యువకుడు తన జీవితంలో కొన్న మొట్టమొదటి లాటరీ ఇది.
తనకు లాటరీ తగిలిన విషయంపై ఆజాద్ సింగ్ స్పందిస్తూ.. తాను కొన్న లాటరీ టికెట్ మీద తప్పకుండా 400 రూపాయల బహుమతి ఉండటంతో అది వస్తుందనే తాను కొన్నానని చెప్పాడు. అయితే, కోటీశ్వరుడిని అవుతానని మాత్రం తాను ఊహించలేదని చెప్పాడు. రెండు రోజుల క్రితం తాను లాటరీ పరిస్థితి ఏమైందని చూసుకున్నట్లు చెప్పాడు. తనకు లాటరీ తగిలిందని తెలుసుకొని, ముందు తన కళ్లను తానే నమ్మలేకపోయానని చెప్పాడు. ఈ తరువాత ఆ విషయాన్ని నిర్ధారించుకొని స్నేహితులు, ఇంట్లోవారితో సంబరాలు చేసుకున్నానని చెప్పాడు. ఆ డబ్బుతో తాను ఇల్లు కట్టుకుంటానని, వ్యాపారం పెట్టుకుంటానని, అందులో దేవుడికి కొంత దక్షిణ వేస్తానని, అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈ డబ్బుతో సొంత వ్యాపారం పెట్టుకుంటానని పేర్కొన్నాడు.