: నాగోల్ మెట్రో గ్రౌండ్‌లో ర్యాలీకి హైకోర్టు అనుమతి.. పిటిషన్ ఉపసంహరించుకున్న టీజేఏసీ!
రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయినప్పటికీ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరగలేదని, అందుకు నిరసనగా రేపు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఇచ్చిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరిస్తోన్న నేపథ్యంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, అధికార ప్రతినిధి జి.వెంకటరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది ఈ రోజు మరోసారి విచారణకు రాగా కొద్ది సేపటి క్రితం హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ ర్యాలీని నగరశివారులోని నాగోల్ మెట్రో గ్రౌండ్‌లో నిర్వహించుకునేందుకు టీజేఏసీకి అనుమతి ఇచ్చింది. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.
అయితే, ఈ తీర్పుపై ఉత్తర్వులు జారీ చేయడానికి కొద్ది సేపటికి ముందే తాము వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుటున్నామని టీజేఏసీ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి ఒప్పుకున్నారని చెప్పారు. అయితే, తాము నగరంలో శాంతియుతంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేపడతామని పోలీసులకి హామీ ఇచ్చామని, అయినప్పటికీ పోలీసులు అందుకు అనుమతి ఇవ్వడం లేదని ఈ సందర్భంగా టీజేఏసీ తరఫున్యాయవాది మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ ర్యాలీని జల్లికట్టు వంటి పోరాటాలతో పోల్చుతూ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని చెప్పడం భావ్యం కాదని సదరు న్యాయవాది అన్నారు.