: 180 అబద్ధాలు ఆడిన 'చిన్న మోదీ' కేసీఆర్ : షబ్బీర్ అలీ
180 అబద్ధాలు ఆడిన చిన్న మోదీ కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ తీవ్రంగా విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తండ్రీ కొడుకులు తమాషాలు చేస్తున్నారంటూ కేసీఆర్, కేటీఆర్ లపై మండిపడ్డారు. ఎల్లంపల్లికి గోదావరి నీళ్లను తాము తీసుకువస్తే, తండ్రీకొడుకులు ఆ నీటిని తలపై చల్లుకుంటూ ఫొటోలకు పోజులు ఇస్తున్నారని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తెలంగాణ సొమ్మును ఇతరులకు దోచిపెడుతున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. నవంబర్ 8న బ్లాక్ డే అని, మోదీకి సంసారం గురించి తెలియదని, బాధ్యత తెలియని వ్యక్తి ఆయన అని మండిపడ్డారు. కాగా, తెలంగాణ చేనేతకు నటి సమంత బ్రాండ్ అంబాసిడరా? అంటూ మరోమారు ఆయన ప్రశ్నించారు. చీర కట్టుకోవడం తెలంగాణ మహిళలకు రాదా? ప్రముఖ నటుడు నాగార్జునకు కాబోయే కోడలు సమంతకే తెలుసా? అంటూ షబ్బీర్ అలీ మండిపడ్డారు.