: హైదరాబాద్ ఆస్తుల్లో సింహభాగం ఇవ్వాల్సిందేనంటున్న ఏపీ సర్కారు!
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9లో పొందుపరిచిన అంశాల్లో తాము గుర్తించిన 17 కార్పొరేషన్లలో సింహభాగం ఆస్తులను తమకు ఇవ్వాల్సిందేనని చంద్రబాబు ప్రభుత్వం పట్టుబడుతోంది. ఏపీ, తెలంగాణల్లోని జనాభా సంఖ్య ఆధారంగా 58:42 నిష్పత్తిలోనే ఆస్తుల పంపకాలు సాగాలని, ఏపీ జెన్ కో సహా 58 శాతం ఆస్తులను తమకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ, నేడు కేంద్ర హోం శాఖకు ఆస్తుల వివరాలను అందించింది. హైదరాబాద్ లో ఉన్న భవనాలు, భూములు, వాటాల విలువను, వాటిల్లో తమకు దక్కాల్సిన భాగాన్ని గురించి ఈ జాబితాలో పేర్కొంది. తమకు మొత్తం రూ. 3 వేల కోట్ల విలువైన ఆస్తులు దక్కాల్సి వుందని ఏపీ రాష్ట్ర ప్రణాళికా బోర్టు ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి విభజన సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టుబడే మిగతా అన్ని సంస్థల విభజనా జరగాలని డిమాండ్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
కాగా, పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 10లో ఉన్న ఉన్నత విద్యామండలి ఆస్తులు, అప్పులపై గత సంవత్సరం మార్చిలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరుస్తూ, 58:42 నిష్పత్తిలో పంపకాలు జరగాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ 9లో ఏపీ ప్రభుత్వం గుర్తించిన 17 సంస్థలకూ ఇదే నియమం వర్తింపజేయాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. షెడ్యూల్ 9లో పొందుపరచబడిన సంస్థల్లో అత్యధికం హైదరాబాద్ లోనే ఉండటంతో, వాటి ఆస్తుల విలువ వందల, వేల కోట్ల రూపాయలకు పెరిగింది. ఇక షెడ్యూల్ 10లో మొత్తం 107 సంస్థల కార్పొరేషన్లు ఉండగా, వాటిల్లో 97 తెలంగాణలోనే ఉన్నాయి. అలాగే షెడ్యూల్ 9లో పేర్కొన్న మరో 91 సంస్థల కేంద్రాలు కూడా హైదరాబాద్ లో ఉండగా, వీటి విలువ సుమారు రూ. 75 వేల కోట్లుగా అంచనా కడుతున్నారు
కాగా, ఈ నిష్పత్తిలో పంపకాలకు తాము సిద్ధమేనని, అయితే, అది కేవలం హైదరాబాద్ లో ఉన్న ఆస్తులకు మాత్రమే పరిమితం కావాలని, ఇతర ప్రాంతాల్లోని ఆస్తులు, శిక్షణా కేంద్రాలకు సంబంధించి మరే విధమైన పంపకాలనూ తాము అంగీకరించే ప్రసక్తే లేదని తెలంగాణ తరపు కమిటీ సభ్యుడు ఎన్ రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఇటీవల ఇరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో గవర్నర్ నరసింహన్ సమావేశమైన వేళ, ఇదే అంశం చర్చకు రాగా, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ తమ పాత వాదనలకే కట్టుబడ్డాయి. ఇక షెడ్యూల్ 9లోని కంపెనీల విభజనపై కేంద్రం షీలా బిడే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయగా, కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్న ఏపీ, టీఎస్ ప్రభుత్వాలు, అది వచ్చిన తరువాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నాయి.