: బ్రోతల్ కేసులో ఇరికిస్తానంటూ మహిళను బెదిరించిన ఎస్సై.. పురుగుల మందు తాగిన మహిళ


న్యాయం చేయండంటూ తమ వద్దకు వచ్చే అభాగ్యులను ఆదుకోవాల్సిన ఓ పోలీసు అధికారి... సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించాడు. ఓ దళిత మహిళను చితకబాది, బ్రోతల్ కేసులో ఇరికిస్తానంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో, తీవ్ర మానసిక వేదనను అనుభవించిన సదరు మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

ఘటన పూర్వపరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఆరుంబాకలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, తమ ఇంటి వద్ద ఉన్న మెట్లను కూల్చడం అన్యాయమంటూ బాధితురాలి భర్త ఏసురత్నం అడ్డుకున్నాడు. దీంతో, తమనే ఎదిరిస్తారా? అంటూ సర్పంచ్ ప్రసన్నత, ఆమె భర్త కిరణ్, వారి అనుచరులు వీరిపై దాడి చేశారు. ఈ క్రమంలో ఏసురత్నం చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో నిన్న రాత్రి బాధితురాలు సువార్తమ్మ, ఆమె భర్త ఏసురత్నంలను ఎస్ఐ భాస్కర్ పోలీస్ ప్టేషన్ కు పిలిపించాడు. వారిని లాఠీలతో కొట్టాడు. ఆ తర్వాత బ్రోతల్ కేసులో ఇరికిస్తానంటూ సువార్తమ్మను బెదిరించాడు. దీంతో, మనస్తాపానికి గురైన సువార్తమ్మ పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితికి వెళ్లిన ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మరో 24 గంటలు గడిస్తే కానీ, ఏమీ చెప్పలేమని డాక్టర్లు తెలిపారు.

బ్రోతల్ కేసులో ఇరికిస్తానని, అండమాన్ జైలుకు పంపిస్తానని, ఇంటి చుట్టుపక్కల ఉన్న వారి సంతకాలు తీసుకుని ఇంటిని కూల్చేస్తానని వీరిని పోలీస్ స్టేషన్ లో భాస్కర్ అవమానించాడు. ఈ నేపథ్యంలో, సువార్తమ్మ కుమార్తె అనూష కన్నీటిపర్యంతం అయింది. మా అమ్మకు ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏమిటని ఆమె కంటతడి పెట్టింది. 

  • Loading...

More Telugu News