: గుడ్ బై హైదరాబాద్.. భాగ్యనగరానికి బై బై చెప్పిన స్పీకర్ కోడెల
ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు భాగ్యనగరానికి బైబై చెప్పేశారు. ‘గుడ్ బై హైదరాబాద్’ అంటూ అమరావతికి పయనమయ్యారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ శాసనసభ, శాసనమండలి తరలింపు ఖరారైన విషయాన్ని స్పీకర్ స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్‌ను వీడి వెళ్తున్న సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం అసెంబ్లీ భవనంలో కొందరు పత్రికా సంపాదకులు, పాత్రికేయులకు ఆయన వీడ్కోలు విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా పాత్రికేయులతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయన్నారు. అటువంటిది ఇప్పుడు హైదరాబాద్‌ను వదిలి వెళ్లాల్సి రావడం బాధగా ఉందన్నారు. ఎవరెవరం ఎక్కడ ఉన్నా ఇకముందు కూడా ఇవే సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీలో మార్చి 3న బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. నూతన శాసనసభ, శాసనమండలి భవనాల్లో అన్ని పార్టీలకు ఎటువంటి వివక్షా లేకుండా కేటాయింపులు జరిపినట్టు కోడెల వివరించారు.