: ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థుల గంజాయి దమ్ము.. తీవ్రంగా పరిగణిస్తున్న అధికారులు
విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో గంజాయి తాగుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులను అధికారులు పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా కనిపించిన ఆరుగురు విద్యార్థులను పట్టుకున్న అధికారులు వారిని విచారించారు. వీరిలో కొందరు గంజాయి కానీ మరో మత్తు పదార్థం కానీ తీసుకున్నట్టు గుర్తించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఓ కమిటీ వేసి విచారణ చేపట్టారు. విద్యార్థుల విషయాన్ని ఉపకులపతి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలియజేశారు. విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. మత్తుపదార్థాలకు బానిసలవుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఒడిశా నుంచి వచ్చిన ఓ ముఠా ఇంజినీరింగ్ కాలేజీని అడ్డాగా మార్చుకుని మాదకద్రవ్యాల దందాకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులున్నాయి. అంతేకాదు మత్తుకు బానిసలుగా మారిన విద్యార్థులు విశాఖ ఏజెన్సీకి వెళ్లి మరీ గంజాయి తీసుకుని వస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు, పోలీసులు భావిస్తున్నారు.