: ఎలక్ట్రానిక్ శవాలు వచ్చేస్తున్నాయి.. ఏపీలో ఈజీ కానున్న వైద్య విద్యాబోధన!


వైద్య విద్యా బోధన కోసం ఇక శవాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే త్వరలో ఎలక్ట్రానిక్ శవాలు వచ్చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సిమ్యులేటరీ ల్యాబొరేటరీల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లేబొరేటరీ ఏర్పాటుకు ఒక్కో కళాశాలకు రూ.20 కోట్లు ఖర్చు కానుంది. సిమ్యులేటరీ విధానాన్ని ఎలక్ట్రానిక్ వైద్య విద్యగా చెప్పుకోవచ్చు. ఇందులో ఓ ఎలక్ట్రానిక్ శవం ఉంటుంది. గుండె, మెదడు, నరాలు, ఎముకలకు సంబంధించిన ఆపరేషన్ కోసం ఇందులో ముందుగానే ప్రోగ్రాం తయారై ఉంటుంది. దీనివల్ల విద్యార్థులకు నేరుగా ఆపరేషన్ చేసిన అనుభూతి కలుగుతుంది. శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో రక్తస్రావం అవుతున్నట్టు, గుండె కొట్టుకుంటున్నట్టు, శ్వాసక్రియ జరుగుతున్నట్టు అనుభూతి కలుగుతుంది. ఆపరేషన్ అయిపోగానే ఆ ప్రోగ్రామ్‌ను తిరిగి పూర్వ స్థితికి తీసుకురావచ్చు.

తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కళాశాల, విశాఖపట్టణంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కళాశాలల్లో సిమ్యులేటరీ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఎస్వీ కళాశాలకు ఇప్పటికే ఇది మంజూరైంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఈ విధానాన్ని భవిష్యత్తులో పీజీ విద్యార్థులకు కూడా అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు.



  • Loading...

More Telugu News