: ఇక పగటిపూటైనా వాహనాలకు లైటు వెలగాల్సిందే... ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు
పట్టపగలు మీ బైక్ లేదా ద్విచక్ర వాహనంపై వెళుతూ, పొరపాటున లైటు వేసుంటే, ఎదురుగా వచ్చేవాళ్లు లైట్ వెలుగుతోందని చేతులతో సైగ చేయడం, ఆపై మీరు లైట్ ఆర్పిన అనుభవం ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది. ఇక పగలైనా సరే, బండి లైట్ ఆర్పకూడదు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే నిబంధనల ప్రకారం, బండి ఇంజన్ ఆన్ చేస్తే, లైటు వెలగాల్సిందే. ఇందుకోసం ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ (ఏహెచ్ఓ) టెక్నాలజీతోనే బండ్లు తయారు చేసి విక్రయించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పాత వాహనాలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రహదారుల భద్రత కమిటీ విచారణ జరిపి, నివేదికను ఇవ్వగా, అందులో పగటి పూట లైటును తప్పనిసరి చేయాలని సూచించింది. మలేషియా, యూరప్ వంటి పలు దేశాల్లో ఈ నిబంధన ఇప్పటికే అమలవుతున్న సంగతి తెలిసిందే.
కాగా, పగలు కూడా లైటు వెలిగే బండ్లు వెళుతుంటే, ప్రతి ఒక్కరూ సైగలు చేయడం ఇబ్బందికరమని వాహనదారులు పేర్కొంటున్నారు. దీనివల్ల బ్యాటరీ త్వరగా డెడ్ అవుతుందని అంటున్నారు. కాగా, ఈ వాదనను కంపెనీలు కొట్టి పారేస్తున్నాయి. బైక్ ఇంజన్ ఆన్ అయితే, ఏసీ సర్క్కూట్ వల్ల లైట్లు వెలుగుతాయని, బ్యాటరీతో సంబంధముండదని టూ వీలర్ కంపెనీలు చెబుతున్నాయి.