: బాబు ఇంకా మారలేదంటోన్న టీఆర్ఎస్ ముఖ్యనేత
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిలో మార్పు వచ్చిందంటే ఎవరూ నమ్మరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. నేడు తన నియోజకవర్గం సిద్ధిపేటలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిన నేతలకు భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పిన బాబు ఇంకా మారలేదని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.
టీడీపీ ఎప్పటికైనా ఆంధ్రా పార్టీయేనన్న హరీశ్ రావు, తెలంగాణలో బాబుకు ఘోర పరాభవం తప్పదని వ్యాఖ్యానించారు. తెలంగాణ, సీమాంధ్ర పేరిట రెండు రాష్ట్రాలు ప్రకటించకుండా.. ఆదర్శాంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తానని బాబు చెప్పడం తగదని, అది తెలంగాణ ప్రజలను మోసగించడమే అని హరీశ్ రావు దుయ్యబట్టారు.