: డీఎంకేతో చేతులు కలిపి పన్నీర్ చాలా పెద్ద తప్పు చేశారు: పళనిస్వామి
పన్నీర్ సెల్వం అసలు స్వరూపం అసెంబ్లీలో బయటపడిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. అమ్మ జయలలితకు, అన్నాడీఎంకే పార్టీకి పన్నీర్ తీరని ద్రోహం చేశారని విమర్శించారు. శత్రువర్గమైన డీఎంకేతో చేతులు కలిపి, పెద్ద తప్పు చేశారని మండిపడ్డారు. జయ సమాధి వద్ద చిన్నమ్మ శశికళ చేసిన శపథం నెరవేరిందని అన్నారు. పార్టీని కాపాడుకున్నామని చెప్పారు. ఇప్పుడు అమ్మ ఆత్మకు శాంతి లభిస్తుందని తెలిపారు.
అసెంబ్లీలో విపక్షాల ప్రవర్తన చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. ఎంజీఆర్, జయలలిత ఆశయాలను తాము సాధిస్తామని పళనిస్వామి తెలిపారు. అమ్మ బాటలోనే నడుస్తూ, అమ్మ పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. బల పరీక్షలో నెగ్గిన తర్వాత ఎమ్మెల్యేలతో కలసి జయలలిత సమాధి వెద్దకు వెళ్లి, నివాళి అర్పించారు పళనిస్వామి. అనంతరం ఆయన మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.