: మరమ్మతుల కోసం గోల్డెన్ బే రిసార్ట్ మూసివేత!
మొన్నటి దాకా గోల్డెన్ బే రిసార్ట్ అంటే ఎవరికీ తెలియదు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేశాక... ఆ పార్టీలో సంక్షోభం తలెత్తింది. ఆ తర్వాత తన వర్గ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వారిని గోల్డెన్ బే రిసార్ట్ లో ఉంచింది శశి. ఆప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఈ రిసార్ట్ పేరు మారుమోగి పోయింది. పది రోజుల పాటు ఆ రిసార్ట్ వద్దే మీడియా ప్రతినిధులు కూడా మకాం వేశారు. పోలీసులు కూడా భారీ సంఖ్యలో రిసార్ట్ వద్ద మోహరించారు.
ఈ నేపథ్యంలో, ఈ రోజు పళనిస్వామి అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడానికి ఎమ్మల్యేలందరినీ తీసుకెళ్లారు. దీంతో, రిసార్ట్ ఖాళీ అయింది. ఈ రిసార్ట్ చెన్నైకి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎమ్మెల్యేలంతా వెళ్లిపోయిన వెంటనే... రిసార్ట్ ను మూసివేస్తున్నట్టు దాని యాజమాన్యం ప్రకటించింది. రిసార్ట్ కు మరమ్మతులు చేయించాలని... అందుకే మూసివేస్తున్నామని తెలిపింది.