: జీవితాన్ని చిదిమేస్తున్న స్మార్ట్‌ఫోన్లు... జరభద్రం.. వైద్యుల హెచ్చరిక
స్మార్ట్‌పోన్ ఉంటే అరచేతిలో ప్రపంచ వ్యాప్త సమాచారం.. ఎప్పుడో విడిపోయిన స్నేహితులతో కబుర్లు.. సరికొత్త గేమ్స్.. ఏ విషయం అయినా సోషల్ మీడియా ద్వారా తమ స్నేహితులతో పాటు ముక్కు మొహం తెలియని వారితో పంచుకునే సదుపాయం ఇలా ఒకటా? రెండా? నేటి నగర జీవితంలో స్మార్ట్‌ఫోనే ప్రపంచంలా మారిపోతోంది. మన్ను తిన్న కృష్ణుడి నోరు తెరిపించి చూస్తే యశోదకు మొత్తం విశ్వమే కనిపించినట్లు.. అరచేతిలో స్మార్ట్‌ఫోన్ తెరచిచూస్తే చాలు అదే వింత కనపడుతోంది. అయితే, అదే స్మార్ట్ ఫోన్ వల్ల కుటుంబ సంబంధాలు విపరీతంగా దెబ్బతింటున్నాయి. ఒత్తిడిపై మరింత ఒత్తిడి పెంచేలా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ లోకంలో విహరిస్తూ జీవితభాగస్వామిని సైతం కొందరు పట్టించుకోవడం లేదట. వీటి కారణంగానే ప్రతిరోజు కనీసం పది కేసులు విజయవాడలోని కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం కొత్తగా దాఖలవుతున్నాయట. స్మార్ట్‌ఫోన్ ప్రభావం యువత పైనే కాదు ఎంతో మంది తల్లిదండ్రులపైనా పడుతోంది.
తల్లిదండ్రులు వారి పిల్లల కంటే స్మార్ట్‌ఫోన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని నిపుణులు తేల్చి చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో సరదాగా గడిపే సమయంలో నాలుగో వంతు కూడా పిల్లలతో గడపడానికి కేటాయించడం లేదట. మరోవైపు స్మార్ట్‌ఫోన్ ప్రభావం అత్యధికంగా పడిన భార్యాభర్తలు కూడా ఒకరితో ఒకరు సమయం గడిపే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నారట. ఈ పరిస్థితే కుటుంబ వ్యవస్థ దెబ్బతిని, ఒత్తిడి పెరగడానికి కారణం అవుతోంది. స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్న సోషల్ మీడియా వంటి ఫీచర్లతో అపరిచిత వ్యక్తుల పరిచయాలూ అధికమే. వీటికారణంగానే న్యాయస్థానాలకు వచ్చే సగం విడాకుల కేసులకు ఈ మూడో వ్యక్తే కారణమని లాయర్లు చెబుతున్నారు.
గతంలో భర్త, భార్య చనిపోవడం వంటి కారణాలతో మాత్రమే ఒంటరిగా మారేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్ యుగం పుణ్యమా అని కలహాలతో విడాకుల దాకా వెళ్లి విడిపోతున్నారు. అదే సోషల్ మీడియాలో మరొకరితో పరిచయం ఏర్పాటు చేసుకొని సహజీవనం చేస్తున్న వారి సంఖ్య, పెళ్లి చేసుకునే వారి సంఖ్య కూడా అధికమేనట. మానసిక వైద్యులు నిత్యం కనీసం 40 జంటలకు కౌన్సెలింగ్ ఇస్తుంటారు. స్మార్ట్‌ఫోన్ కారణంగా ఎంతో మంది తల్లిదండ్రులు ఆ ప్రభావం విపరీతంగా పడిన తమ పిల్లలని సైకాలజిస్ట్‌ల వద్దకు తీసుకెళుతున్నారు.
పెళ్లయి ఏడాది కూడా తిరగకుండానే విడాకులు తీసుకుంటున్న వారిని వైద్యులు పరిశీలించగా అందులో అధికశాతం మంది ఎప్పుడు చూసినా స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ల వల్లే విడిపోతున్నారట. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ఎన్నో సైట్లను ఆశ్రయిస్తున్నారు నగరవాసులు. వాటిల్లో వీడియోలను చూస్తూ గడిపేవారి సంఖ్య గత రెండేళ్లలో విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలకు బానిసలైపోతున్నవారు అధికమేనని మానసిక వైద్యులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్‌ల వల్ల నిద్రించే సమయంలో మార్పులు, అలవాట్లలో విపరీత ధోరణులు చోటు చేసుకుంటున్నాయని, వాటివల్ల మనకు నష్టం కలగకుండా ఉండేలా చూసుకుంటూ ఉపయోగించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.