: తోటి ఖైదీలతో కలసి లైవ్ ప్రోగ్రాం చూసిన శశికళ
అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లినప్పటికీ... అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ పార్టీపై తన పట్టును ఏమాత్రం సడలించలేదు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు జెండా ఎగురవేసినా, ఎమ్మెల్యేలు చేజారకుండా క్యాంపు రాజకీయాలను పక్కాగా నిర్వహించిన శశికళ... చివరకు తనకు నమ్మకస్తుడైన పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేశారు. తద్వారా, పార్టీపై తన పట్టు జారకుండా జగ్రత్త తీసుకున్నారు.
బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న శశికళ... నిన్న జరిగిన పళనిస్వామి ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. మహిళల బ్యారక్ లో తోటి ఖైదీలు, తన వదిన ఇళవరసిలతో కలసి ఆమె టీవీలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ విషయాన్ని జైలు అధికారులు వెల్లడించారు. మరోవైపు, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ రోజు జైలుకు వెళ్లి... చిన్నమ్మ ఆశీర్వాదాలు తీసుకోనున్నారు.