: అమ్మ ఆశయాలకోసం పాటుపడతా... ఈ ప్రభుత్వాన్ని కూల్చడమే నా లక్ష్యం: పన్నీర్ సెల్వం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ, అమ్మ జయలలిత పార్టీని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన పార్టీకి కేవలం ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, ప్రజా మద్దతు లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీని శశికళ వారసత్వ పార్టీగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారెవరూ అమ్మ అనుచరులు కాదని ఆయన స్పష్టం చేశారు. అమ్మ ఆశయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ప్రభుత్వం శశికళ చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన అన్నారు. నిజమైన కార్యకర్తలకు ద్రోహం జరిగిందని ఆయన ధ్వజమెత్తారు.
అధికారం చెప్పుచేతల్లో పెట్టుకుని అక్రమాలకు తెరతీశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పళని వర్గమంతా శశికళకు ఊడిగం చేయాల్సిందేనని ఆయన ఎద్దేవా చేశారు. వేదనిలయంలో శశికళ కుటుంబ సభ్యులు ఉండడాన్ని అంగీకరించమని ఆయన తెలిపారు. ప్రభుత్వ అసలు రంగు ప్రజలకు వివరించేందుకు ప్రజల ముందుకు వెళ్తానని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, లక్ష్యాలు వివరిస్తానని ఆయన అన్నారు. జయలలిత మరణానికి శశికళ కుటుంబమే కారణమని ఆయన మరోసారి ఆరోపించారు. అమ్మ లక్ష్యాలను, అమ్మ పార్టీని కాపాడి తీరుతానని, అమ్మ ఆశయాలకు వ్యతిరేకంగా ఏర్పడిన ఈ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యమని ఆయన తెలిపారు.