: నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడానికి కార‌ణం ఏంటో తెలుసా?: జ‌గ‌న్


తాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడానికి ఓ కార‌ణం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలిపారు. ‘నేను ముఖ్య‌మంత్రి కావాల‌ని నాకో కోరిక ఉంది. ఆ కోరిక‌కు అర్థం ఏంటో తెలుసా?  నేను చ‌నిపోయిన త‌రువాత ప్ర‌తి ఇంట్లో నాన్న (వైఎస్‌ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి) ఫొటోతో పాటు నా ఫొటో కూడా ఉండాల‌న్నది నా త‌ప‌నా తాప‌త్ర‌యం. దాన్ని సాధించేందుకు ఆరాట‌ప‌డ‌తాను’ అని వైఎస్ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. తాను కూడా త‌న తండ్రిలా ప్ర‌తి ఒక్క‌రి తోడు ఉంటాన‌ని భ‌రోసా ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ఈ రోజు గుంటూరులోని నల్లపాడులో నిర్వహించిన 'యువభేరి' కార్యక్రమంలో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ...చంద్ర‌బాబు నాయుడి మాదిరిగా త‌న ఆలోచ‌న‌లు డ‌బ్బుపై ఉండ‌వ‌ని అన్నారు. చంద్ర‌బాబు నాయుడు క‌మీష‌న్ల‌కు ఆశ‌ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. రాదు అనుకున్న తెలంగాణను అక్క‌డి ప్ర‌జ‌లు సాధించుకున్నప్పుడు పార్ల‌మెంటు సాక్షిగా ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీని ఎందుకు సాధించుకోలేమ‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. వైసీపీ ఎంపీలంద‌రూ ఆగ‌స్టు త‌రువాత రాజీనామా చేస్తారని, దేశం మొత్తానికి మ‌న బాధ‌ను తెలియ‌జేస్తారని ఆయ‌న అన్నారు. హోదా ఇవ్వ‌క‌పోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఊరుకోరు అని తెలియ‌జేస్తామ‌ని చెప్పారు.

చంద్ర‌బాబు నాయుడు ఒకే అబ‌ద్ధాన్ని వంద‌సార్లు ప్ర‌చారం చేస్తున్నారని జగన్ అన్నారు. ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయ‌ని చెప్పిందే చెబుతున్నారని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు బంగాళాఖాతంలో క‌లిపేస్తార‌ని ఆయ‌న అన్నారు.
తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్న బాధతో ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, తెలుగు వాళ్ల ప్రయోజనాలను ఢిల్లీ వాళ్ల కాళ్ల మీద పారేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుందేమో అనిపిస్తోందని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News