: జైలు నుంచే పార్టీని నడిపించాలని శశికళ నిర్ణయం!
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించడానికి జైలుకి వెళ్లిన శశికళ నటరాజన్ ఇకపై అక్కడి నుంచే రాజకీయాలు నడిపించనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై నిన్న, మొన్న తన పార్టీ నేతలతో చిన్నమ్మ గోల్డెన్ బే రిసార్టు, పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం వద్ద చర్చించారు. తాను జైలుపాలయినప్పటికీ పన్నీర్ సెల్వంతో పోరు మాత్రం ఆగబోదని, అన్నాడీఎంకేను కాపాడుకోవడానికి జైలు నుంచే పార్టీని నడిపిస్తానని ప్రకటించారు.
అందుకు తగ్గట్టుగానే, తన సోదరి కుమారుడు టీటీవీ దినకరన్, మేనల్లుడు వెంకటేశన్‌లను రంగంలోకి దించారు. దినకరన్‌కు పార్టీ పదవి కూడా ఇచ్చి ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాను జైలుకెళ్లినా ఇక్కడి వ్యవహారాలన్నీ తను చెప్పినట్టే జరిగిపోవాలనే ఉద్దేశంతోనే తనకు నమ్మకస్తుడయిన దినకరన్‌ను ఆమె నియమించడం జరిగిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.