: దినకరన్‌పై కేసులే కేసులు.. పౌరసత్వం కూడా సింగపూర్‌దే!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్తూవెళ్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యంత వివాదాస్పదుడిగా పేరుగాంచిన సోదరి కుమారుడు టీవీవీ దినకర్‌ను అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అప్పట్లో ఆయన వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో జయలలిత అతడిని పార్టీ నుంచి, వేద నిలయం నుంచి వెళ్లగొట్టారు. కాగా దినకరన్‌పై పలు కేసులు నమోదై ఉన్నాయి. ఆయన పౌరసత్వం కూడా సింగపూర్‌దే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కోర్టులో తెలిపారు. 1995-96లో ఇంగ్లండ్‌లోని బర్కిలీ బ్యాంకులో దినకరన్ రూ.75 కోట్లు డిపాజిట్ చేశారు. దీంతో అతడిపై విదేశీ మారకద్రవ్యం నిబంధనల ఉల్లంఘన కేసును ఈడీ నమోదు చేసింది. కేసు విచారించిన కోర్టు దినకరన్‌కు రూ.32 కోట్ల జరిమానా విధించింది. అప్పీలు తర్వాత అది రూ.28 కోట్లుగా మారింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.
ఇండియన్ బ్యాంకులో మూడు కోట్ల రూపాయలు రుణం తీసుకున్న శశికళ, దినకరన్‌లు ఆ సొమ్ముతో జయలలిత కోసం కొడనాడు ఎస్టేట్‌ను కొనుగోలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిపైనా విచారణ జరుగుతోంది. జయ టీవీ చానల్ కోసం సాంకేతిక పరికరాలు కొనుగోలు చేసినప్పుడు విదేశీ మారకద్రవ్యాన్ని పెద్ద ఎత్తున ఎగ్గొట్టారనే ఆరోపణలపైనా దినకరన్‌పై కేసు నమోదైంది. దీనిపైనా కోర్టులో విచారణ జరుగుతోంది. ఇలా పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న దినకరన్‌ను తిరిగి అక్కున చేర్చుకోవడాన్ని పార్టీలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారు.