: తెలంగాణ ప్రభుత్వానికి శశికళ పన్ను బకాయిలు
అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన వీకే శశికళ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను బకాయిలు చెల్లించాల్సివుంది. సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి, రాధిక కాలనీలో శశికళ పేరిట ఓ ఇల్లు ఉండగా, దానికి గత రెండేళ్ల నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదు. పన్ను బకాయిలను నూరు శాతం వసూలు చేయాలని సంకల్పించిన కేసీఆర్ సర్కారు, ఈ మేరకు శశికళ పేరిట నోటీసులు కూడా జారీ చేశారు. కాగా, ఈ ఇంటిని 1990 ప్రాంతంలో శశికళ కొనుగోలు చేశారు. అప్పట్లో హైదరాబాద్ కు వచ్చినప్పుడు కొంతకాలం జయలలిత ఇదే ఇంట్లో బస చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఆపై ప్రైవేటు వ్యక్తులకు ఈ ఇంటిని అద్దెకు ఇచ్చినప్పటి నుంచి, వారు ఖాళీ చేసి వెళ్లిన తరువాత గత నాలుగేళ్లుగా ఈ ఇల్లు ఖాళీగానే ఉందని తెలుస్తోంది.