: 'లోపలికి రండి' అంటూ పిలిచి మరీ మీడియాపై శశికళ వర్గీయుల దాడి... మీడియా ఆందోళన


మీడియా ప్రతినిధులపై మరోసారి శశికళ వర్గీయులు దాడి చేయడం తమిళనాట కలకలం రేపుతోంది. గోల్డెన్ బే రిసార్ట్ బయట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడానికి తోడు, దోషులను తరలించేందుకు పోలీసులు ఖైదీల వ్యాన్ ను సిద్ధం చేశారు. దీంతో ఈ రాత్రికి ఆమెను అరెస్టు చేస్తారని ఊహాగానాలు మొదలు కావడంతో... కాసేపట్లో మీడియాతో మాట్లాడుతానంటూ శశికళ మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు. కొంత సేపటి తరువాత కేవలం కెమెరా మెన్లు మాత్రమే రిసార్ట్ లోపలికి రావాలని, రిపోర్టర్లు బయటే ఉండాలని.... వర్తమానం పంపారు.

దీంతో తమిళ, మలయాళ, తెలుగు మీడియా ప్రతినిధులంతా గేట్ బయట వేచి చూస్తూ, కెమెరామెన్ లను లోపలికి పంపారు. అంతే, లోపలికి వెళ్లిన కెమెరా మెన్లపై శశికళ వర్గీయులు దాడులకు దిగారు. ఈ ఘటనలో ఒక ఎలక్ట్రానికి మీడియా కెమెరామెన్ తో పాటు, ప్రింట్ మీడియాకు చెందిన ఒక కెమెరామెన్ కూడా గాయపడ్డారు. మిగిలిన వారంతా వెనక్కి పరుగులు పెట్టారు. దీనిని నిరసిస్తూ మీడియా ప్రతినిధులంతా గోల్డెన్ బే రిసార్ట్ ఎదుట శశికళ, ఆమె వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. కాగా, మొన్న ఉదయం కూడా శశికళ వర్గీయులు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News