: హుటాహుటిన రిసార్టుకు చేరుకున్న జయలలిత మేనల్లుడు దీపక్
పన్నీర్ సెల్వంను ఎదుర్కొనేందుకు జయలలిత వారసుడు, ఆమె మేనల్లుడు దీపక్ ను రంగంలోకి దించాలని భావిస్తున్న శశికళ, పిలుపు మేరకు దీపక్ కొద్దిసేపటి క్రితం రిసార్టుకు చేరుకున్నారు. దీంతో శాసనసభా పక్ష నేతగా ఆయన పేరునూ పరిశీలిస్తున్నారన్న వార్తలకు బలం చేకూరింది. దీపక్ కు పగ్గాలు అప్పగిస్తే, ఎమ్మెల్యేలను ఏకతాటిపై ఉంచవచ్చని, పన్నీర్ వర్గం ఆశలపై నీళ్లు చల్లవచ్చన్నది శశికళ ఆలోచనగా తెలుస్తోంది. దీపక్ అయితే, తమకు అభ్యంతరం లేదని పలువురు ఎమ్మెల్యేలు స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా, జయలలిత ఉన్నన్ని రోజులూ దీపక్ ఆమెకు దూరంగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత దూరం పెట్టిన ఆయనకు ఎమ్మెల్యేల మద్దతు ఎంతవరకూ ఉంటుందన్నది ప్రశ్నార్థకమే.