: శశికళ అక్రమాస్తుల కేసులో ఇద్దరు జడ్జీలు ఏం చెప్పారు? మూడు నిమిషాల్లో ముగిసిన తీర్పు ప్రక్రియ
అక్రమాస్తుల కేసులో ఏ1 జయలలిత, ఏ2 శశికళ, ఏ3 సుధాకరణ్, ఏ4 ఇళవరసిలను సుప్రీంకోర్టు దోషులుగా ప్రకటిస్తూ, శిక్షను ఖరారు చేసింది. ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనుకుంటున్న శశికళ ఆశలు ఈ తీర్పుతో అడియాశలయ్యాయి. సుప్రీంకోర్టులో మొత్తం తీర్పును వెలువరించే ప్రక్రియ కేవలం మూడు నిమిషాల్లో ముగిసింది.
తొలి తీర్పును వెలువరించిన జస్టిన్ పినాకి చంద్రఘోష్ కోర్టు హాల్లోకి వచ్చిన వెంటనే... సీల్డ్ కవర్ తెరిచారు. ఈ కేసు చాలా క్లిష్టమైనదైనప్పటికీ తీర్పును వెలువరిస్తున్నానని చెప్పారు. ట్రయల్ కోర్టు తీర్పుతో తాను ఏకీభవిస్తున్నానని... శశికళ వెంటనే పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించారు. ఆమెకు రూ. 10 కోట్ల జరిమానా విధిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసును తనతో పాటు విచారించిన అమితవ్ రాయ్ ఇప్పుడు తన తీర్పును చెబుతారని అన్నారు. ఆ తర్వాత జస్టిస్ అమితవ్ రాయ్ తన తీర్పును వెలువరిస్తూ, అవినీతి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేసులోని నిందితులందరినీ దోషులుగా ప్రకటిస్తున్నానని తీర్పునిచ్చారు.