: పన్నీర్ సెల్వం ఇంటి వద్ద సంబరాలు.. వేగంగా పావులు కదుపుతున్న పన్నీర్
జయలలిత అక్రమాస్తుల కేసులో సహనిందితులుగా ఉన్న ఆమె నెచ్చెలి శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్‌లను దోషులుగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడగానే ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నివాసం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. ఆయనకు మద్దతు తెలుపుతున్న వారంతా పండుగ చేసుకుంటున్నారు. ఇక శశికళ వైపు ఉన్న వారంతా తన వైపుకి వస్తారని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు. అప్పుడే ఆయన వారితో మంతనాలు జరిపే విషయమై తన మద్దతుదారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో ఈ తీర్పు ప్రభావం ఆమెపై పడింది. అంతేకాదు, ఆమెకు ఇక రాజకీయ భవితవ్యం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావాన్ని డీఎంకే వర్గాలు కూడా పరిశీలిస్తున్నాయి.