: ఎంపీలు వస్తున్నారు సరే.. ఎమ్మెల్యేలు రారేమి?: పన్నీర్ వర్గం తర్జన భర్జన!
ఎమ్మెల్యేల నుంచి తనకు మద్దతు పెరుగుతుందని, శశికళ శిబిరం నుంచి శాసనసభ్యులు వెల్లువలా వచ్చి పడతారని భావించిన పన్నీర్ సెల్వం వర్గం ప్రస్తుతం నిరాశలో కూరుకుపోయింది. ఆదివారం నాటికి 25 మంది ఎమ్మెల్యేలు తన గూటికి చేరుతారని భావించిన ఓపీఎస్‌కు మంత్రి పాండియరాజన్ ఒక్కరే వచ్చి చేరడంతో షాక్ తగిలింది. దీంతో పునరాలోచనలో పడిన పన్నీర్ సెల్వం కొత్త ఎత్తులు రచిస్తున్నారు.
శశికళ ఎమ్మెల్యేలను ఉంచిన రిసార్ట్‌కు వెళ్లాలని భావించినా పోలీసులు వారించడంతో వెనక్కి తగ్గారు. విషయం తెలిసిన శశికళ వర్గం అప్రమత్తమై ప్రైవేటు సైన్యాన్ని మోహరించింది. శశికళపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఓపీఎస్ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖుల మద్దతు సంపాదించడంలో విజయం సాధించినా ఎమ్మెల్యేల నుంచి మాత్రం పెద్దగా స్పందన లేకపోవడం ఆయనను బాధిస్తోంది. ఆదివారం నాటికి ఆయనకు జై కొట్టింది ఆరుగురు ఎమ్మెల్యేలే. వీరికి తోడుగా 11 మంది ఎంపీలు కూడా ఆయనకు మద్దతు తెలిపారు.
ఎంపీలందరూ ఓపీఎస్ వైపు పరుగులు తీసేందుకు గల కారణాలపై శశికళ వర్గం ఆరా తీస్తుంటే, ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు ఎందుకు రావడం లేదని ఓపీఎస్ వర్గం తర్జన భర్జన పడుతోంది. రెండు వర్గాలు లోపాలపై రంధ్రాన్వేషణ చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడడం ద్వారా వారిపై ఒత్తిడి పెంచాలని పన్నీర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి పాండియరాజన్ ఆదివారం మైలపూర్ శాసనసభ్యుడు నటరాజన్‌తో సంప్రదించారు. ఓపీఎస్‌తో ఫోన్లో మాట్లాడించారు. అయితే తాను ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోలేనని, కొంత సమయం కావాలని ఆయన పేర్కొన్నారు. ఇంకోవైపు పన్నీర్ ఎత్తులను చిత్తు చేసే పనిలో శశి వర్గం బిజీగా ఉంది.