: పన్నీర్ ను కౌగిలించుకుని ఏడ్చేసిన ఎమ్మెల్యే!
మూడు రోజుల పాటు శశికళ వర్గంలో ఉండి, ఆపై తప్పించుకు వచ్చిన ఎమ్మెల్యే ఒకరు, పన్నీర్ సెల్వం ఇంటికి వచ్చి ఆయన్ను కౌగిలించుకుని, ముద్దు పెట్టి ఏడ్చారు. తమను బలవంతంగా తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. శశికళ శిబిరంలోని చాలా మంది ఎమ్మెల్యేలకు అక్కడ ఉండటం ఇష్టం లేదని, తప్పించుకు వచ్చేందుకు మార్గాలను వెదుకుతున్నారని ఆయన తెలిపారు. వారందరినీ బయటకు తెప్పించాలని కోరారు. కాగా, తనకే సీఎంగా అవకాశం లభిస్తుందన్న నమ్మకంతో ఉన్న పన్నీర్ సెల్వం, ఈ ఉదయం నుంచి తనను కలిసేందుకు వస్తున్న సీనియర్ నేతలు, సినీ నటులు, అభిమానులతో మాట్లాడుతూ బిజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలో, నటుడు అరుణ్ పాండ్యన్, పన్నీర్ సెల్వం ఇంటికి వచ్చి తన మద్దతు తెలిపారు. గవర్నర్ ఇంకా నిర్ణయాన్ని ప్రకటించక పోవడాన్ని శశికళ వర్గం జీర్ణించుకోలేక పోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నేటి సాయంత్రం 4 గంటల వరకూ సమయం ఇచ్చిన శశికళ, ఆపై తన సత్తా చూపిస్తానని హెచ్చరించిన నేపథ్యంలో చెన్నై అంతటా హై అలర్ట్ ప్రకటించారు. నగరానికి వస్తున్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో బందోబస్తు పెంచి, రైళ్లలో దిగుతున్న వారిలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని ప్రశ్నిస్తున్నారు.