: కలిసొస్తే సంతోషం... రాకున్నా మీపై గౌరవమే!: జయ కుటుంబీకులపై ప్రేమ కురిపించిన పన్నీర్ సెల్వం


తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తానే ఉంటానని పన్నీర్ సెల్వం మరోసారి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. కొద్ది సేపటి క్రితం తన ఇంటి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, జయలలిత కుటుంబ సభ్యులు తనకు మద్దతు పలకాలని కోరారు. వారంతా తనతో కలిసొస్తే సంతోషమని, వారు రాకున్నా జయ కుటుంబీకులుగా జీవితాంతమూ గౌరవిస్తానని స్పష్టం చేశారు. జయలలిత పక్కనబెట్టిన శశికళ బంధువర్గాన్ని, ఆమె మరణించగానే తిరిగి తన పంచన ఎందుకు చేర్చుకున్నారని శశికళను ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేని పనిని శశికళ ఎందుకు చేస్తోందని అడిగారు.

కాగా, పన్నీర్ సెల్వం నివాస ప్రాంతంలో చిన్నా చితకా నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా చేరుకోవడంతో, వాళ్లను నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తనకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వారిని పన్నీర్ సెల్వం సైతం చిరునవ్వుతో పలకరిస్తున్నారు. నేటి సాయంత్రానికి శశికళ వర్గంలోని మరింత మంది ఎమ్మెల్యేలు పన్నీర్ శిబిరానికి చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు పోయిస్ గార్డెన్ వెలవెలబోతున్నట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News