: పోలీసుల అధీనంలో రోజా!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను గన్నవరం ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ పార్లమెంటేరియన్ సదస్సులో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ సదస్సు ప్రాంగణానికి వెళ్లాలనుకున్న ఆమె వద్దకు వచ్చిన పోలీసులు ఆమెను పోలీసు వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఇటీవలే రోజా మహిళా పార్లమెంటు గురించి మాట్లాడుతూ.. తాను కూడా ఆ సదస్సులో మాట్లాడతానని మహిళా హక్కులను గురించి తెలుపుతానని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సదస్సులో ఏ గందరగోళం చెలరేగకుండా ఆమెను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. వాహనంలో పోలీసులు ఆమెను ఎక్కడకు తీసుకెళుతున్నారనే విషయం గురించి తెలియాల్సి ఉంది.