: స్నాప్‌డీల్‌లో వస్తువుల చోరీ... ఓఎల్ఎక్స్‌లో అమ్మకం.. నలుగురు కేటుగాళ్ల అరెస్ట్!


గురుగ్రామ్‌లో న‌లుగురు వ్య‌క్తులు చేస్తోన్న మోసం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ-కామ‌ర్స్ సంస్థ‌ స్నాప్‌డీల్ ద్వారా వ‌స్తువుల‌ను చోరీ చేసి మ‌ళ్లీ వాటిని ఓఎల్ఎక్స్ ద్వారా విక్ర‌యిస్తున్నారు. ఈ న‌లుగురు యువ‌కుల్లో ముగ్గురు స్నాప్‌డీల్ సరుకులు చేరవేసే లాజిస్టిక్స్ సంస్థలో డెలివ‌రీ బోయ్‌లుగా ప‌నిచేస్తున్నారు. దీంతో వారి ప‌ని సులువుగా మారింది. ఈ నలుగురు వ్య‌క్తులు తప్పుడు పేర్లు, అడ్ర‌స్‌ల‌తో స్నాప్‌డీల్‌లో ప‌లు వస్తువులు బుక్ చేసి, వాటిని తీసుకునేవారు. అయితే, అనంత‌రం సంస్థ‌కు రిట‌ర్న్ ఇచ్చేస్తున్నామంటూ వాటి స్థానంలో రాళ్లు, సబ్బులు వంటి వ‌స్తువులు పెట్టి ఇచ్చేసేవారు. ఇక త‌మ వ‌ద్ద ఉంచుకున్న వ‌స్తువుల‌ను ఓఎల్ఎక్స్‌లో పెట్టి విక్ర‌యించేవారు.
 
స్నాప్‌డీల్ వ‌స్తువుల‌ను డెలివరీ చేసే వల్కన్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏరియా మేనేజర్ రమేష్ కుమార్ వ‌స్తువులు మాయం అవుతున్న విష‌యాన్ని గ‌మ‌నించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ద‌ర్యాప్తు జ‌ర‌ప‌గా ఆ సంస్థలో పనిచేసే డెలివరీ బోయ్‌లు  రవికాంత్, హరి ఓం, అమృత్‌ల‌తో పాటు మ‌రో వ్య‌క్తి కరణ్ శర్మ ఈ ప‌నిచేసిన‌ట్లు తేలింది. వారిని అరెస్టు చేసిన పోలీసులు గుర్‌గ్రామ్ కోర్టులో ప్రవేశపెట్టారు. కరణే ఈ ప్లాన్‌ను వేశాడ‌ని తేలింది.

  • Loading...

More Telugu News