: గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకుంటే శశికళకు.. ఆలస్యమైతే పన్నీర్‌కు లాభం!


చెన్నైలో గవర్నర్ విద్యాసాగర్‌రావు కాలుమోపడంతో క్లైమాక్స్‌కు చేరిన తమిళ రాజకీయంలో గెలుపెవరిదన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ నిర్ణయం ఇద్దరి తలరాతలు మార్చేది కావడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. అయితే గవర్నర్ నిర్ణయం వెలువరించేందుకు తీసుకునే సమయం కూడా పన్నీర్ సెల్వం, శశికళ జాతకాలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గవర్నర్ కనుక వెంటనే నిర్ణయం తీసుకుంటే శశికళ సీఎం పీఠంపై కూర్చుంటారని, ఒకవేళ ఆలస్యమైతే కనుక పన్నీర్ సెల్వం తిరిగి గద్దెనెక్కడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో గవర్నర్ తుది నిర్ణయం తీసుకునేందుకు ఆర్టికల్ 163(2) ప్రకారం తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే విచక్షణాధికారానికి కూడా పరిమితులు ఉంటాయి.

 మెజారిటీ ఎమ్మెల్యేలున్న ఒక పార్టీ తమ నేతను ఎన్నుకుంటే రాజ్యాంగం ప్రకారం ఆ వ్యక్తితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాలని గతేడాది అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే గవర్నర్ తన విచక్షణతో ఓ కారణం పేర్కొంటూ నిర్ణయాన్ని కొన్ని రోజులు వాయిదే వేసే విచక్షణాధికారం ఆయనకు ఉందని నిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు గత తీర్పును  పరిగణనలోకి తీసుకుంటే శశికళతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. దీంతో ఆయన నిర్ణయం ఎంత ఆలస్యమైతే అంత మంచిదని పన్నీర్ వర్గం భావిస్తోంది. గవర్నర్ విచక్షణాధికారంపై ఇప్పటికిప్పుడు కోర్టుకు వెళ్లే పరిస్థితి లేదు. కావాలంటే నిర్ణయం తీసుకున్న తర్వాత వెళ్లే వీలుంది. అయితే గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ బద్ధంగా ఉంటే మాత్రం కోర్టులు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News