: 'జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ' అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఎంపీ కవిత
అమరావతిలో జరుగుతున్న మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో టీఆర్ఎస్ ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సదస్సులో మాట్లాడుతూ... జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏపీ నవ్యరాజధాని అమరావతి... పురాణాల్లోని అమరావతి వైభవాన్ని సాధించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో మహిళలు ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఇందిరా గాంధీ, రాణీ రుద్రమదేవీ, ఝాన్సీ లక్ష్మీ భాయ్ వంటి ఎంతో మంది మహిళలు ఎన్నో విజయాలు సాధించి స్త్రీ శక్తిని చూపించారని ఆమె అన్నారు.
గాంధీజి ఇచ్చిన పిలుపుతో ఇదే విజయవాడలో వందల మంది మహిళలు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైళ్లకు కూడా వెళ్లారని కవిత అన్నారు. భారత మహిళలకు లీడర్ షిప్ కొత్తకాదని చెప్పారు. కొత్త విషయం ఏంటంటే మహిళల పట్ల పెరుగుతున్న వివక్ష అని చెప్పారు. సదస్సు ద్వారా అది పోతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, యువతులు ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.