: అడ్వొకేట్ జనరల్ సలహా తీసుకోనున్న తమిళనాడు గవర్నర్.. మరో రెండు రోజులు తప్పని ఉత్కంఠ?
తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా వేడిని పుట్టిస్తున్నాయి. నిన్న సాయంత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తమ తమ వర్గాలతో కలసి తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో, గవర్నర్ కోర్టులోకి పంచాయితీ చేరింది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అనే ఉత్కంఠ మొదలైంది. అయితే, ఈ నరాలు తెగే ఉత్కంఠ మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అక్రమాస్తుల కేసులో శశికళకు సంబంధించి సోమవారం నాడు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో, అప్పటిదాకా గవర్నర్ వేచి చూసే ధోరణిని అవలంబించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు మరోసారి అడ్వొకేట్ జనరల్ సలహా తీసుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. తన ముందు ఉన్న ఆప్షన్లను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు.