: శశికళ కుటుంబానికే ‘పోయెస్ గార్డెన్’ ఇల్లు.. సంచలనం కలిగిస్తున్న జయ వీలునామా?
పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసం (వేదనిలయం) ఎవరికి చెందుతుంది? పోయెస్ గార్డెన్ ఇంటిని జయ స్మారకంగా మారుస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించగా, అందులోంచి కదిలేది లేదని శశికళ ఎందుకు భీష్మించుకున్నారు? మరి ఇంతకీ వేద నిలయం ఎవరికి చెందుతుంది? దానిపై పూర్తి హక్కులు ఎవరివి? అనే ప్రశ్న అందరినీ వేధిస్తున్న సమయంలో ఆన్‌లైన్‌లో జయ పేరిట షికారు కొడుతున్న ఓ వీలునామా సంచలనం కలిగిస్తోంది.
వేద నిలయాన్ని జయ తన నెచ్చెలి శశికళ మరదలు ఇళవరసికి చెందేలా వీలునామా రాసినట్టు అందులో ఉంది. శశికళ వర్గాలు కూడా ఇదే చెబుతున్నట్టు తమిళ మీడియా సైతం పేర్కొంది. వీలునామాపై జయ సంతకం స్పష్టంగా కనిపిస్తున్నా దానిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జయలలిత గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్‌లో వేద నిలయం తన పేరునే ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. కాబట్టి కొన్ని రోజుల్లోనే ఆమె వీలునామా రాసే అవకాశం ఉండదని చెబుతున్నారు. వీలునామా కనుక నిజమైతే పోయెస్ గార్డెన్ నుంచి శశికళ కుటుంబాన్ని కదిలించే ధైర్యం ఎవరికీ ఉండదు. అది వారి సొంతమవుతుంది.