: పన్నీర్ సెల్వంకు అండగా నిలిచిన మునుస్వామి... శశికళపై మొదట తిరుగుబాటు చేసింది ఆయనే!
జయలలిత మరణం తర్వాత శశికళపై మొట్టమొదటగా తిరుగుబాటు చేసిన వ్యక్తి కృష్ణగిరి జిల్లాకు చెందిన వన్నియార్ నేత కేపీ మునుస్వామి. అన్నాడీఎంకే పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూసిన శశికళపై ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే, ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోని శశికళ, ఆయనపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. అయితే, ప్రస్తుతం, తమిళనాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గూటికి మునుస్వామి చేరారు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గీయులు రహస్య ప్రాంతానికి తరలించిన ఎమ్మెల్యేలను ఏదో విధంగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో మునుస్వామి కూడా ఆయన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, పన్నీర్ సెల్వం వర్గంలో ఎస్పీ షణ్ముగనాథన్, పీహెచ్ పాండియన్, సాయిదై దురైస్వామి, సీవీ షణ్ముగం, ఈ.మధుసూదన్ తదితర నేతలు కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం.