: నాగు పాముతో ఫొటోకు పోజిచ్చిన నటి అరెస్ట్!
డైలీ సీరియల్ ‘నాగార్జున’ కోసం బుల్లితెర నటి శ్రుతి ఉల్ఫత్ ప్రాణంతో ఉన్న నాగుపామును తన చేతిలో పట్టుకుని నిలబడటంపై వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు మండిపడుతూ ఆమెపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రుతి సహా మరో నటి, ఇద్దరు ప్రొడక్షన్ మేనేజర్లను పోలీసలు ముంబయిలో నిన్న అరెస్టు చేశారు. ముంబయి అటవీ శాఖాధికారులు తెలిపిన వివరాల ప్రకారం, డైలీ సీరియల్ ‘నాగార్జున’ ప్రచారం కోసం నాగుపాముతో తాను ఉన్న వీడియోను శ్రుతి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిందన్నారు.
దీన్ని చూసిన పలువురు జంతు సంరక్షణ కార్యకర్తలు ఆమె పై ఫిర్యాదు చేయగా, ఈ మేరకు వారిని విచారణ చేశామన్నారు.
అయితే, అది నిజమైన పాము కాదని, స్పెషల్ ఎఫెక్ట్ మాత్రమేనని వారు చెప్పారన్నారు. అయితే, ఈ విషయమై నిర్ధారణ చేసుకునేందుకు ఆ వీడియోను డౌన్ లోడ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, గత నెల 17న వచ్చిన రిపోర్టులో ఆ పాము నిజమైందేనని తేలిందని అన్నారు. దీంతో, నటి శ్రుతికి నోటీసులు పంపామని, పీవోఆర్ దాఖలు చేసి విచారణకు రమ్మనమని ఆదేశించామన్నారు. శ్రుతి సహా ఇద్దరు ప్రొడక్షన్ మేనేజర్లు నిన్న విచారణకు వచ్చారని, తమ సీరియల్ లో ఉపయోగించినది నిజమైన నాగుపామేనని అంగీకరించడంతో వారిని ఒక్కరోజు కస్టడీకి తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను కోర్టు ఆదేశించిందన్నారు. కాగా, పాములకు హాని చేయాలనే దృశ్యాలు ఈ వీడియోలో లేవు కనుక, ఆమెకు శిక్ష వేసే బదులు వన్య ప్రాణి సంరక్షణకు కృషి చేసే విధంగా కృషి చేయాలని పలువురు జంతు ప్రేమికులు అంటున్నారు.