: ఆయనే మా ఆయన... ఒకే స్థానంలో పోటీ పడుతున్న ఇద్దరు భార్యలు!
ఎన్నికల సందర్భంగా ఎన్నో చిత్ర విచిత్రాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ ఆసక్తికర సన్నివేశం ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. సితార్ గంజ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున మాలతి బిశ్వాస్ (56) బరిలోకి దిగారు. పీసీసీ మాజీ సభ్యుడు శ్యామ్ ప్రసాద్ బిశ్వాస్ భార్యను తాను అంటూ ఎన్నికల్లో ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. ఆమెకు పోటీగా బిందా బిశ్వాస్ (52) అదే స్థానంలో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. శ్యామ్ బిస్వాస్ కు తానే నిజమైన భార్యను అంటూ ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల అఫిడవిట్లో వీరిద్దరూ కూడా తమ భర్త పేరును శ్యామ్ ప్రసాద్ బిశ్వాస్ గా పేర్కొన్నారు.
ఈ విషయంపై శ్యామ్ బిశ్వాస్ స్పందించారు. మాలతి తనకు చట్టబద్ధమైన భార్య అని... బిందా తనపై పుకార్లను ప్రచారం చేస్తోందని అన్నారు. ఇంతకు మించి తాను ఒక్క మాటను కూడా ఎక్కువగా మాట్లాడబోనని చెప్పారు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు మాలతి నిరాకరించారు. మరోపక్క బిందా బిశ్వాస్ మాట్లాడుతూ, న్యాయం కోసం, తన హోదా కోసం తాను పోరాడుతున్నానని చెప్పారు. 1976లో కోల్ కతాలో తనను శ్యామ్ పెళ్లి చేసుకున్నారని... ఆ తర్వాత తనను బృందావనం తీసుకెళ్లారని, తాము అక్కడే స్థిరపడ్డామని తెలిపారు.
ఓ కేసులో ఇరుక్కున్న శ్యామ్ ఉత్తరాఖండ్ లోని సితార్ గంజ్ వెళ్లారని బిందా చెప్పారు. వ్యాపారంలో ఆయన ఎదిగేందుకు తన కుటుంబం ఎంతో సహాయం చేసిందని... ఆ తర్వాత మాలతిని శ్యామ్ పెళ్లి చేసుకుని, తనను ఇంట్లో నుంచి గెంటి వేశారని ఆరోపించారు. శ్యామ్ ప్రసాద్ బీడీ తయారీ కంపెనీని నిర్వహిస్తున్నారు. అయితే, ఈ సతుల పోరులో ఎవరు గెలుస్తారనే విషయం అక్కడ ఆసక్తికరంగా మారింది.